భారతదేశంలో ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏవైనా అక్రమాలకు పాల్పడితే లేదా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిని పట్టించేందుకు ఎన్నికల సంఘం ఓటరుకు ఇచ్చిన వజ్రాయుధం "సీవిజిల్" యాప్. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిటిజన్స్ (పౌరులు), జాగృతి (విజిల్) అనే ఆంగ్ల పదాల కలయికతో ఈ యాప్‌కు "సీవిజిల్" అని పేరు పెట్టారు.
ఎన్నికల్లో డబ్బు, మద్యం, చీరలు, బహుమతులు పంచడం వంటి వాటిని ఫోటో లేదా వీడియో తీసి ఈ యాప్ ద్వారా పంపితే 15 నిమిషాల్లో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతారు.
అయితే ఇంతటి గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన యాప్‌ను కొందరు అవగాహనా లోపంతో దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల నియమావళి అతిక్రమణకు సంబంధంలేని సెల్ఫీలు, కంప్యూటర్ స్క్రీన్‌లు, చెట్లు చేమలు, కొండలు, ప్రకృతి ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
పంజాబ్ రాష్ట్రంలో అయితే ఈ యాప్ ద్వారా అప్‌లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలలో దాదాపు 60 శాతం అటువంటివే ఉన్నాయని ఎన్నికల సంఘం తెలియజేసింది. ప్రజలకు ఈ యాప్‌ను సదుద్దేశంతో అందించామని కాబట్టి ఈ యాప్‌ను దుర్వినియోగం చేయకుండా అవగాహనతో ఉపయోగించాలని పేర్కొంది.