భార్య శవం మోసినందుకు కురుస్తున్న లక్షలు... గొణుక్కుంటున్న ఊరి ప్రజలు....

గురువారం, 15 సెప్టెంబరు 2016 (20:32 IST)
కట్టుకున్న భార్య మరణిస్తే ఆమె మృతదేహాన్ని తరలించేందుకు డబ్బు లేక భుజం పైన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచిన ఒడిశా కహండి ప్రాంత వాసి దానా మాఝి దశ తిరిగిపోయింది. అతడి దీనావస్థ చూసి దేశవిదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. బెహరైన్ ప్రధాని అతడికి రూ. 9 లక్షల చెక్కును పంపారు. ఇక సామాన్యులు, స్వచ్ఛంద సంస్థలు పంపుతున్న డబ్బు వస్తూనే ఉంది. అతడికి ఇందిరా ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణానికి రూ. 75 వేలను ఇచ్చింది ఒడిశా ప్రభుత్వం. 
 
ఇక రెడ్ క్రాస్ సంస్థ రూ. 30 వేలు, సులభ్ ఇంటర్నేషనల్ రూ. 5 లక్షల డబ్బును ఐదేళ్ల కాలపరిమితికి ఫిక్సెడ్ చేసింది. ఇంకా మహారాష్ట్ర స్వచ్ఛంద సంస్థ ఒకటి రూ. 80 వేలను దానాకు, ముగ్గురు కుమార్తెలకు రూ. 10 వేల చొప్పున అందజేసింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యాపారులిద్దరు చెరో లక్ష రూపాయలను పంపారు. ఇలా మొత్తం అతడికి లక్షల్లో విరాళాలు వచ్చి పడుతున్నాయి. ఆ డబ్బంతా తన పిల్లల చదువుకు ఉపయోగిస్తానని అతడు చెపుతున్నాడు. 
 
ఐతే అతడి ఊరి ప్రజలు మాత్రం దానా మాఝికి అలా డబ్బు రావడాన్ని పట్టించుకోవడంలేదు. అతడిలాంటివారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారంటూ నిట్టూర్చుతున్నారు. మీడియాలో అతడలా కనబడినందుకే ఇంతలా డబ్బు వస్తోందనీ, మీడియా కంట్లో పడకుండా ఇలాంటి కష్టాలను చాలామంది అనుభవిస్తున్నారంటూ వారు చెపుతున్నారు. మామూలే... మానవ నైజం ఇంతే కదా...?!!

వెబ్దునియా పై చదవండి