మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

బుధవారం, 18 మే 2016 (16:54 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఉదయం 8 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు చేపడుతారు. దీంతో సుమారు రెండు నెలల పాటు సాగిన ఈ ఐదు రాష్ట్రాల మహా సంగ్రామానికి మరో కొన్ని గంటల్లో తెరపడనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు భారత ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. 
 
దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు.. వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు రాష్ట్రాల్లో బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల భవితవ్యం తెలిసిపోతుందన్నారు. 3 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు జరిగిన తర్వాత ఈవీఎం కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. 
 
ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజెట్‌ రూపంలో విడుదల చేస్తారు. మే 16తో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీల భవితవ్యం ఎలా ఉండనుందో ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా పార్టీలు మాత్రం ఓటరన్న తమకే ఓటు వేశారన్న నమ్మకంతో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి