హస్తినలో తొలి నేషనల్ కో-ఆపరేషన్ సమ్మిట్ - 8 కోట్ల మందితో అమిత్ షా కాన్ఫరెన్స్

శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర కేబినెట్‌లో కొత్తగా సహకార శాఖను ఏర్పాటు చేసింది. ఈ శాఖకు తొలి మంత్రిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియమితులయ్యారు. సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శనివారం సహకార సంస్థల మెగా సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. 
 
ఈ సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలకు చెందిన 8 కోట్ల మంది సభ్యులతో ఆయన మాట్లాడనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సమావేశం జరగుతుండగా.. ఈ కాన్ఫరెన్స్‌‌ను సహకార సంస్థలు ఐఎఫ్ఎప్‌సీఓ, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, ఎన్ఏఎఫ్ఈడీ, క్రిభ్‌కోపాటు ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయి.
 
ఈ కొత్త మంత్రిత్వ శాఖను మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇంత పెద్ద సదస్సు జరగనుండటం ఇదే తొలిసారి. సహకార సంస్థలకు ‘సులభతరమైన వ్యాపారం’ కోసం ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, బహుళ-రాష్ట్ర సహకార(ఎంఎస్‌సిఎస్) సంస్థల అభివృద్ధికి శ్రీకారం చుట్టే దిశగా ఈ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పని చేయనుంది.
 
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి వరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న సహకార శాఖను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను హోంమంత్రి అమిత్ షాకు అప్పగించారు. తాజాగా ఈ శాఖకు కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి దేవేంద్ర కుమార్ సింగ్‌ను కార్యదర్శిగా నియమించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు