సీబీఐ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్ : అధికార దుర్వినియోగానికి మచ్చుతునక!!

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (11:30 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుంది. కోర్టు అనుమతి మేరకు ఆయన వద్ద మూడు రోజు పాటు విచారణ జరుపనుంది. ఈ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్నారు. 
 
ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేకకోర్టు ఎదుట కేజ్రీవాల్‌‍ను హాజరుపర్చినప్పుడు.. న్యాయాధికారి అమితాబ్‌ రావత్‌ అనుమతి మేరకు సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో ప్రశ్నించటానికి వీలుగా కేజ్రీవాల్‌ను తమకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. దీనిపై తొలుత తీర్పును రిజర్వు చేసిన అమితాబ్‌ రావత్‌.. మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయాన్ని వెలువరించారు. 
 
తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. కాగా, కోర్టులో విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ తన వాదనలను స్వయంగా వినిపించారు. 'మొత్తం తప్పంతా మనీష్‌ సిసోడియాదేనని నేను ఒక ప్రకటన చేశానంటూ సీబీఐ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేను అటువంటి ప్రకటన ఎన్నడూ చేయలేదు. 
 
సిసోడియా, ఆమ్‌ ఆద్మీ పార్టీ, నేను నిర్దోషులం. ఇదంతా మా ప్రతిష్ఠను దెబ్బతీయటానికి మీడియా వేదికగా సీబీఐ చేస్తున్న కుట్ర' అని తెలిపారు. దీనికి సీబీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ.. తాము వాస్తవాల ఆధారంగానే వాదనలు వినిపిస్తున్నామని, మీడియాతో సీబీఐ వర్గాలు ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. 
 
ఈ కేసులో సహనిందితుడైన విజయ్‌ నాయర్‌ తన కింద పని చేశాడన్న సంగతిని కూడా కేజ్రీవాల్‌ అంగీకరించటం లేదు. అతిషీ మర్లేనా, సౌరభ్‌ భరద్వాజ్‌ల కింద నాయర్‌ పని చేశాడని చెబుతున్నారు. మొత్తం తప్పంతా మనీశ్‌ సిసోడియాదేనని అంటున్నారు. 
 
అందువల్ల, కేసుకు సంబంధించిన పత్రాలను ఆయన ముందుపెట్టి ప్రశ్నించాల్సి ఉంది. ఈ మేరకు సీబీఐ కస్టడీకి అప్పగించాలి అని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి మూడు రోజులు కస్టడీకి అనుమతి ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు