ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఆ నలుగురు మహిళలు

ఠాగూర్

మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (13:05 IST)
ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెబ్లీలో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటుకూడా రాలేదు. ఈ గెలుపుతో దాదాపు 23 యేళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఢిల్లీలోని బీజేపీ నేతలు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు పర్వేష్ వర్మ పేరు బలంగా వినిపిస్తుండగా, తాజాగా నలుగురు మహిళా నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. 
 
వీరిలో షాలిమార్ బాగ్ స్థానం నుంచి గెలిచి రేఖా గుప్తా, నజఫ్‌గఢ్ నుంచి నీలం పెహల్వాన్, గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్, వాజీపూర్ నుంచి పూనం శర్మలు తమతమ ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇపుడు ఈ నలుగురు మహిళా నేతలు ముఖ్యమంత్రి రేస్‌లోకి దూసుకొచ్చారు. 
 
ఢిల్లీలో ఇప్పటివరకు ముగ్గురు మహిళలు ముఖ్యమంత్రులుగా పని చేశారు. వారిలో తొలి వ్యక్తిగా బీజేపీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ నిలిచారు. 1998లో ఆమె సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే, ఆమె కేవలం 52 రోజుల మాత్రమే సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ రెండో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆమె 2013 నుంచి ఏకంగా 15 యేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిశీ మూడో ముఖ్యమంత్రిగా కేవలం నాలుగున్నర నెలల మాత్రమే ఉన్నారు. అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళడంతో అతిశీకి ఛాన్స్ లభించింది. కాగా, విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు