దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. ఫలితంగా గాలిలో నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కారు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఢిల్లీలోకి డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది. అత్యవసర, నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలు మినహా ఇతర వాహనాలేవీ ప్రవేశించడానికి వీల్లేదని ఆప్ సర్కారు ఆదేశాలు జారీచేసింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే రూ.20 వేల అపరాధం విధిస్తామని ఢిల్లీ రవాణా శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే, ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సీఎన్జీ వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. అదేవిధంగా అత్యవసర సేవల వినియోగానికి ఉపయోగించే వాహనాలపై ఆంక్షలు వర్తించవని తెలిపింది. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజల్ వాహనాలు మాత్రం ఢిల్లీలోకి ఎంట్రీ లేదని పేర్కొంది. ప్రజా రవాణా కోసం 1000 సీఎన్‌జీ బస్సులను అద్దెకు తీసుకోనున్నట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు.