కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

ఠాగూర్

గురువారం, 28 ఆగస్టు 2025 (13:07 IST)
కర్నాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లాలో అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కోడి వింతగా నీలి రంగు గుడ్డుపెట్టింది. సయ్యద్ నూర్ అనే రైతు పెంచుతున్న కోళ్లలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ గుడ్డును పరిశీలించిన పౌల్ట్రీ నిపుణులు... బైలివెర్డిన్ అనే పిగ్మెంట్ కారణంగానే ఈ రంగు గుడ్డు వచ్చిందని వెల్లడించారు. కాగా, ఈ వింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటు కోళ్లను పెంచుకుంటున్నాడు. వాటిలో ఒక కోడి తాజాగా నీలం రంగు గుడ్డు పెట్టడంతో ఆయన ఆశ్చర్యపోయాడు. సాధారణంగా తెలుపు రంగులో ఉండే కోడిగుడ్లను చూసిన స్థానికులు ఈ నీలం గుడ్డు ఓ అద్భుతంగా కనిపించింది. దీంతో ఈ విషయం ఊరంతా పాకి ఓ కోడిని, ఆ నీలి రంగు గుడ్డును చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. 
 
ఈ వింతైన గుడ్డు సమాచారం అందుకున్న చన్నగిరి తాలూకా పశుసంవర్ధఖ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్ నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుంది. వారు ఆ కోడిని, గుడ్డును క్షుణ్ణంగా పరిశీలీంచారు. కొన్ని జాతుల కోళ్ళలో ఉండే బైలివెర్డిన్ అనే వర్ణద్రవ్యం (పిగ్మెంట్) కారణంగా గుడ్డు పెంకుకు నీలి లేదా ఆకుపచ్చ రంగు వస్తుందని డాక్టర్ అశోక్ వివరించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని అయితే గుడ్డు రంగు మారినా దానిలోని పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు