ఏళ్ల క్రితం అమ్మాయిలపై దారుణాలు జరిగాయని, మృతదేహాలను తానే పాతిపెట్టానని చెప్పి కలకలం రేపిన శానిటరీ వర్కర్, ఇప్పుడు సిట్ అధికారులనే తప్పుదోవ పట్టించిన ఆరోపణలతో అరెస్టయ్యాడు. అతను చెప్పిన సమాచారం పూర్తిగా అవాస్తవమని దర్యాప్తులో తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం అధికారికంగా అతన్ని అరెస్టు చేశారు.
ధర్మస్థలంలో బహుళ మృతదేహాలను రహస్యంగా ఖననం చేశారనే పారిశుధ్య కార్మికుడి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు అధికారులు ఇప్పటివరకు 17 వేర్వేరు ప్రదేశాలలో తవ్వకాలు జరిపారు. అతని సమాచారం ఆధారంగా అధికారులు అతను చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు చేపట్టారు. అయితే, గంటల తరబడి శ్రమించినా అక్కడ ఎలాంటి మృతదేహాలు గానీ, మానవ అవశేషాలు గానీ లభించలేదు. దీంతో, అతను దర్యాప్తు బృందాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించాడనే నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.