పూణె మైనర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కేసు : వెలుగు చూస్తున్న కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు!!

వరుణ్

గురువారం, 13 జూన్ 2024 (13:22 IST)
పూణె మైనర్ నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసులో కళ్లు బైర్లు కమ్మేటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, ఈ కేసులో రక్త నమూనా మార్పిడికి పాల్పడిన వైద్యుడు మామూలు వ్యక్తి కాదని తేలింది. అతడు ఏకంగా ఓ క్రిమినల్  సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఇక తాజాగా నిందితుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ ఏకంగా జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ప్రాంగణంలోనే రూ.లక్షలు లంచం చెల్లించినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను కూడా సేకరించారు. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు ఈ సొమ్మును ససూన్‌ ఆస్పత్రి ప్యూన్‌ అతుల్‌ ఘాల్‌కాంబ్లే అనే వ్యక్తి వచ్చి తీసుకెళ్లినట్లు ధ్రువీకరించారు. 
 
మధ్యవర్తికి విశాల్‌ అగర్వాల్‌ డ్రైవర్‌ ద్వారా రూ.4 లక్షలు అందజేశాడు. వీటిల్లో రూ.3 లక్షలను అతుల్‌కు చెల్లించారు. ఇప్పటికే ఆస్పత్రి ప్యూన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక విశాల్‌ అగర్వాల్‌ దంపతులు, ఈ వ్యహారానికి మధ్యవర్తిగా వ్యవహరించిన అష్ఫాక్‌ మకాన్‌దార్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అమర్‌ గైక్వాయిడ్‌ అనే వ్యక్తి కూడా మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితుడి రక్త నమూనాలను అతడి తల్లి బ్లడ్‌ శాంపిల్స్‌తో భర్తీ చేసిన విషయం తెలిసిందే.
 
ససూన్‌ ఆస్పత్రిలోని ఫోరెన్సిక్‌ విభాగం పనితీరుపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. ఈ విభాగం అధిపతి అయిన డాక్టర్‌ అజేయ్‌ తావ్‌డే గతంలో కూడా పలు కేసుల్లో ఇలానే రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుణె క్రైం బ్రాంచ్‌ అధికారులు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే ఓ ఆంగ్ల వార్తా పత్రిక వద్ద వ్యక్తం చేశారు. తావ్‌డే నిందితుల రక్తనమూనాలు మార్చేయడం ఇదే తొలిసారి కాదని వారు పేర్కొన్నారు. 
 
ఇతడికి సంబంధించిన డాక్టర్లు, బ్రోకర్ల నెట్‌వర్క్‌ పుణె చుట్టుపక్కల పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు జిల్లాల్లో విస్తరించినట్లు వెల్లడించారు. ఏదైనా హైప్రొఫైల్‌ కుటుంబం మద్యపానం చేసి వాహనం నడిపినట్లు కేసు నమోదైతే.. ఈ నెట్‌వర్క్‌ ఆ కుటుంబాన్ని సంప్రదిస్తుంది. తర్వాత కొంత మొత్తం సొమ్ములు తీసుకొని రక్తనమూనాలు మార్చేసి.. స్వల్ప శిక్షలు పడేట్లు చేస్తుంది. కేసును బట్టి కనీసం రూ.5 లక్షలు వసూలు చేస్తారని చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఈ నెట్‌వర్క్‌ చురుగ్గా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు