శశికళను రెండు రోజుల్లో తరిమేస్తాం.. పార్టీ నుంచి బహిష్కరిస్తాం- పన్నీర్‌కే స్టాలిన్ సపోర్ట్

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (20:07 IST)
శశికళను పోయెస్ గార్డెన్ నుంచి రెండు రోజుల్లో తరిమేస్తామని.. మధుసూదనన్ శుక్రవారం మీడియాతో అన్నారు. తనను అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు చిన్నమ్మ శశికళ ప్రకటించడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పైన చర్యలు తీసుకునే అధికారం శశికళకు ఏమాత్రం లేదని ధ్వజమెత్తారు. అసలు తామే శశికళను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు.
 
త్వరలో తాము కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామని మధుసూదనన్ స్పష్టం చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరో కేడర్ నిర్ణయిస్తుందని తెలిపారు. కేడర్ ఎవరిని ఎన్నుకుంటే వారే పార్టీ చీఫ్ అవుతారని చెప్పారు. దివంగత జయలలిత నివసించిన వేద నిలయం ప్రజల ఆస్తి అని మధుసూదనన్ చెప్పారు. అందులో ఉన్న శశికళను రెండు రోజుల్లో తరిమేస్తామన్నారు.  
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పన్నీర్ సెల్వంకు సొంత పార్టీ నేతల మద్దతే కాకుండా ప్రతిపక్ష నేతల మద్దతు కూడా లభిస్తోంది. పన్నీర్ సెల్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతిపక్ష పార్టీ డీఎంకే నేత స్టాలిన్ ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిశారు. సీఎంగా పన్నీర్ సెల్వం ఉంచాలని గవర్నర్‌కు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి