కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాల పాలనలో దేశంలో కుంభకోణాలు వెలుగు చూసేవని ఇపుడు ప్రతి పైసా పేదలకే చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో పేద ప్రజల హక్కులు, సంపద దోపిడీకి గురయ్యాయని ఆరోపించారు. 2014కు ముందు దేశంలో చోటు చేసుకున్న అవినీతి, కుంభకోణాలను ప్రజలు మర్చిపోరని అన్నారు.
'2014కు ముందు కాంగ్రెస్ పాలనలో దేశంలో జరిగిన అవినీతి, కుంభకోణాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. పేద ప్రజల హక్కులు, సంపద దోపిడీకి గురయ్యాయి. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ సాయం వారి చేతికి అందకముందే దోపిడీకి గురయ్యేది. కానీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందించే నగదు సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారు. వ్యవస్థలో దోపిడీని అడ్డుకుంటే పేదల సంక్షేమానికి ఎక్కువ మొత్తం ఖర్చు చేయొచ్చు. దానివల్ల ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది' అని ప్రధాని తెలిపారు.
2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంటే ప్రస్తుతం ఐదో స్థానానికి చేరిందని ప్రధాన్నారు. 'పన్ను రూపంలో చెల్లించే ప్రతి పైసా దేశాభివృద్ధికి ఖర్చవుతుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. అందుకే 2014 తర్వాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదాయపన్ను శాఖ గణాంకాల ప్రకారం పన్ను చెల్లించే వ్యక్తి సగటు ఆదాయం 2014లో రూ.4 లక్షలుగా ఉంటే.. తొమ్మిదేళ్లలో రూ.13 లక్షలకు పెరిగింది. గత ఐదేళ్లలో సుమారు 13.50 కోట్ల మంది భారతీయులు బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన్న ఉన్నవారు) నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించిందని' అయన అన్నారు.