రాఖీ కట్టినా అక్రమ సంబంధం అంటగట్టేస్తారా? జయప్రద ఆవేదన

శనివారం, 2 ఫిబ్రవరి 2019 (10:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్‌తో తనకున్న సన్నిహిత్యంపై సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద స్పందించారు. అమర్ సింగ్ తనకు గాడ్‌ఫాదర్ లాంటివారని చెప్పారు. అలాంటి ఆయనకు రాఖీ కట్టినా తనకు ఆయనకు అక్రమ సంబంధం ఉన్నట్టు ఈ జనాలు నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ముంబైలో జరుగుతున్న క్వీన్స్‌లైన్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో శుక్రవారం జయప్రద పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్‌ సింగ్‌తో తనకున్న రాజకీయ అనుబంధంపై ఆమె స్పందించారు. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో తన ప్రత్యర్థి, ఎస్పీ సీనియర్‌ నేత అజమ్‌ ఖాన్‌ వల్ల తాను పడిన బాధలను ఆమె ఈ వేదికపై నుంచి వెల్లడించారు. 
 
'నా రాజకీయ అభివృద్ధికి సహకరించిన వారిలో చాలామంది ఉన్నారు. అలాంటివారిలో అమర్‌ సింగ్‌ ఒకరు. ఆయన్ను నేను గాడ్‌ఫాదర్‌లా భావిస్తాను' అని చెప్పారు. అజంఖాన్‌తో జరిపిన పోరాటంలో, ఒక దశలో తనపై యాసిడ్‌ దాడికి కూడా ఆయన ప్రయత్నించారని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు. మార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో అల్లరి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు తెలిపారు. 
 
ఆ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్న తనకు, అధినేత ములాయం సింగ్‌ సహా ఏ ఒక్క నాయకుడూ కనీసం సానుభూతి తెలపలేదన్నారు. అప్పుడు అమర్‌ సింగ్‌ డయాలసిస్‌ చేయించుకొంటూ.. దూరంగా ఉన్నారన్నారు. ఆస్పత్రి నుంచి తిరిగి రాగానే అమర్‌ సింగ్‌ తనను కలిసి ధైర్యం చెప్పారని తెలిపారు. పురుషస్వామ్య రాజకీయాల్లో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే నిజంగా యుద్ధమే చేయాల్సి ఉంటుందని జయప్రద వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు