ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రైతులంతా కలిసి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధం కాగా, కరోనా ఆంక్షల పేరుతో ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత నాలుగు రోజులుగా సింఘు, టిక్రీ ప్రాంతాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుల ఆందోళనతో ఢిల్లీకి వచ్చే చాలా దారులు మూసుకుపోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతులకు ఓ ఆఫర్ ఇచ్చారు.
ఇదిలావుంటే, అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న పలువురు రైతులపై హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్యాయత్నం తదితర కేసులను బనాయించింది. నిరసనల సందర్భంగా రైతులపై ప్రయోగించిన జలఫిరంగులను ఆపేందుకు ప్రయత్నించిన 26 యేళ్ల నవదీప్ సింగ్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు మోపారు.
అయితే రైతులను కాపాడేందుకు యత్నించిన నవదీప్ సింగ్‌పై సోషల్‌మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, భారతీయ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్, మరికొందరు రైతులపైనా హత్యాయత్నం, దోపిడీ, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. అయినప్పటికీ రైతులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.