నేడు రైతుల బ్లాక్ డే... దేశ వ్యాప్తంగా రైతుల నిరశన

బుధవారం, 26 మే 2021 (09:48 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ శివారుల్లో ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బుధవారం రైతులు బ్లాక్‌ డే పాటించనున్నారు. 
 
ఈ సందర్భంగా అందరూ నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 'బుధవారం బుద్ధ పూర్ణిమ పర్వదినం. సమాజంలో సత్యం, అహింసలు కరవవుతున్నాయి. ఈ ప్రధాన విలువల పునరుద్ధరణ జరిగేలా పండగను జరుపుకోవాలి' అని పిలుపునిచ్చింది. మరోవైపు, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.
 
ఇకపోతే, లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని, ఎక్కడా గుంపులుగా చేరకూడదని రైతులకు ఢిల్లీ పోలీసులు సూచించారు. సరిహద్దుల్లో గస్తీ పెంచినట్టు తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితుల దృష్ట్యా బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. 
 
కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రైతులు సరిహద్దుల్లో ఆందోళన చేస్తుండడంపై ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు పంపించింది. ఆందోళన జరిగే చోట్ల కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు