స్ట్రాంగ్ రూమ్‌లో ఈవీఎంలు... కరెంట్ కట్ - ఆగిన లైవ్ స్ట్రీమింగ్.. ఎంపీలో ఏం జరుగుతోంది?

శనివారం, 1 డిశెంబరు 2018 (16:49 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఇప్పటికే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా, నేతల భవిష్యత్ ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈ ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. అయితే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్ట్రాంగ్ రూమ్‌లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ రూమ్‌లతో పాటు పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పనేనని వారు ఆరోపిస్తున్నారు. దీంతో విపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. స్ట్రాంగ్ రూమ్‌లకు రేయింబవుళ్లు కాపలా కాస్తున్నారు. 
 
నిజానికి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓడిపోతుందనే పలు సర్వేలు చెబుతున్నాయి. ఇంకొన్ని సర్వేలు మాత్రం బీజేపీ - కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా ఉందని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఇటీవల ముగిసింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో ఆ రాష్ట్ర నేతల భవితవ్యం నిక్షిప్తమైంది. అయితే, భోపాల్‌ పాత జైలులోని స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉన్న ఈవీఎంలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందన్న భయంతో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ కార్యకర్తలు శుక్రవారం నుంచి వాటికి కాపలాదారులుగా మారారు. 
 
ఎందుకంటే, స్ట్రాంగ్‌ రూమ్‌లో ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు... దీంతో ఎల్‌ఈడీ తెరలపై లైవ్‌లో ఈవీఎంలు కనపడలేదు. ఈవీఎంలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద తాము రక్షణగా ఉంటున్నామని కాంగ్రెస్‌, ఆప్‌ నేతలు అంటున్నారు. భాజపా తమ అభ్యర్థుల గెలుపు కోసం ఈవీఎంలను దుర్వినియోగపర్చవచ్చని వారు అనుమానిస్తున్నారు.
 
'స్ట్రాంగ్‌ రూమ్‌లో ఎల్‌ఈడీ తెరలు, సీసీటీవీ కెమెరాలు పని చేయలేదు. గత రాత్రంతా కాంగ్రెస్‌, ఆప్‌ కార్యకర్తలు పాత జైలు వద్ద కాపలాగా ఉన్నారు' అని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ తమ ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. డిసెంబరు 11 వరకు ఈవీఎంలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పరిరక్షించాలంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌.. తమ పార్టీ అభ్యర్థులకు సూచించారు. 
 
ఈ విషయంపై భోపాల్‌ డీఐజీ ధర్మేంద్ర చౌదరి మాట్లాడుతూ..."వీఎంలకు మూడంచెల భద్రత కల్పించాం. గేటు వద్ద సంతకం పెట్టకుండా లోపలికి ఎవరినీ అనుమతించబోం' అని అన్నారు. అయితే, విద్యుత్‌ సరఫరా ఆగిపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ఆప్‌ కన్వీనర్‌ అలోక్‌ అగర్వాల్‌ డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు