అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి.. ఆర్కేనగర్ అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు కొత్త చిక్కొచ్చిపడింది. ఇప్పటికే చిన్నమ్మ జైలులో ఊచలు లెక్కబెడుతున్న నేపథ్యంలో.. ఆర్కేనగర్ ఎన్నికల్లో గెలవాలని దినకరన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దినకరన్‌కు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. శశికళ, దినకరన్, భాస్కరన్‌లపై 1996-97లో నమోదైన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు విదేశీ మారక ద్రవ్యం బదిలీల కేసులో.. దినకరన్‌కు ఎగ్మోర్ న్యాయస్థానం షాక్ ఇచ్చింది.
ఆర్కేనగర్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఈ కేసు విచారణకు తాను హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని దినకరన్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. 20 సంవత్సరాల పాటు విచారణలో ఉన్న ఈ కేసును సత్వరం విచారించాలని ఇటీవల మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసు నుంచి తనను తప్పించాలని దినకరన్ కోర్టును ఆశ్రయించారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో అభ్యర్థి కావడంతో విచారణ నుంచి తనను మినహాయింపు ఇవ్వాలని దినకరన్ ఎగ్మూరు ఎకనామిక్స్ అఫెన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు.. దినకరన్ అభ్యర్థనను తోసిపుచ్చారు.
20 ఏళ్ల పాటు నడుస్తున్న ఈ కేసు విచారణ ముగించాలని ఆదేశాలు రావడంతో మంగళవారం నుంచి ప్రతిరోజు కేసు విచారణ జరుగుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో దినకరన్ తలపట్టుకుని కూర్చున్నారు. ఓ వైపు కేసు విచారణకు హాజరు కావాలి.. మరోవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని దినకరన్ వాపోతున్నారు. ఈ కేసులో 2015లో శశికళను నిర్దోషిగా ప్రకటించారు. దినకరన్ నేరం చేశాడని వెలుగు చూడటంతో రూ. 28 కోట్ల అపరాధ రుసుం విధించారు.