సౌత్ ఇండియాలో తొలిసారిగా చర్మానికీ ఓ బ్యాంకు!!

ఆదివారం, 2 ఆగస్టు 2020 (14:12 IST)
దేశంలో తొలిసారిగా చర్మానికి కూడా ఓ బ్యాంకు ఏర్పాటుకానుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో స్థాపించనున్నారు. అదీ కూడా ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా చర్మనిధి ఏర్పాటుకు రోటరీ క్లబ్​ ముందుకొచ్చింది. దాదాపు రూ.70 లక్షల వ్యయంతో చర్మనిధి ఏర్పాటు చేయనున్నట్టు ఉస్మానియా ప్లాస్టిక్​ సర్జరీ విభాగాధిపతి డాక్టర్​ నాగప్రసాద్​ తెలిపారు. 
 
చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి అరుదైన ఘనతకు సిద్ధమవుతోంది. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఉస్మానియాలో చర్మనిధి(స్కిన్‌ బ్యాంకు) ఏర్పాటు కానుంది. దీనికి అవసరమైన గదులు, పరికరాలు, ఇతర సామగ్రికి దాదాపు రూ.70 లక్షల వ్యయమవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేయగా వాటిని సమకూర్చేందుకు రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఈస్ట్‌(హైదరాబాద్‌) ముందుకొచ్చింది. 
 
ఇటీవల ఉస్మానియా వైద్యులను కలిసిన క్లబ్‌ ప్రతినిధులు ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతుల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ నాగప్రసాద్‌ తెలిపారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, డీఎంఈ రమేష్‌రెడ్డిలకు నివేదిక సమర్పించారు. ఆమోదం లభించగానే ప్రక్రియ షురూ కానుంది. 
 
కాగా, ఉస్మానియా ఆస్పత్రిలో ఏటా వెయ్యికి పైగా ప్లాస్టిక్‌ సర్జరీలు జరుగుతుంటాయి. శరీరంపై కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, కుష్ఠు వ్యాధితో వంకరైన చేతులు, కాళ్లు సరిచేయడం.. తెగిన చేతులు, వేళ్లు అతికించడం..ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరమవుతోంది. బాధితుల శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి, గాయాలైన చోట గ్రాఫ్టింగ్‌ ద్వారా అమర్చుతున్నారు. 15-20 శాతం మాత్రమే ఇలా సేకరిస్తారు. ఎక్కువ చర్మం కావాలంటే చర్మ నిధి ఉపయోగపడుతుందని వైద్యుల చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు