కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత

ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (11:33 IST)
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... జూన్ 25వ తేదీన ఢిల్లీలోని ఆర్మీ ద‌వాఖాన‌లో మ‌ల్టీఆర్గాన్ డిసిన్ఫెక్ష‌న్ సిండ్రోమ్ సెప్సిస్ చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం ఉద‌యం 6.55కు తుదిశ్వాస విడిచార‌ని వైద్యులు ప్ర‌క‌టించారు.
 
రాజస్థాన్ రాష్ట్రంలోని జసోల్‌లో 1938, జ‌న‌వ‌రి 3వ తేదీన జ‌న్మించిన జశ్వంత్.. త‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ప‌లుమార్లు కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు. మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయీ హ‌యాంలో ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 
 
1980 నుంచి 2014 వ‌ర‌కు పార్ల‌మెంట్ స‌భ్యునిగా ఉన్నారు. ఐదుసార్లు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా, నాలుగుసార్లు లోక్‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. 1998-99 వ‌ర‌కు ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. 2004-2009 వ‌ర‌కు రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్యవ‌హ‌రించారు.  
 
కాగా, జశ్వంత్ సింగ్ మృతిపట్ల ప్ర‌ధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. జ‌శ్వంత్ సింగ్ సైనికుడిగా, రాజ‌కీయ నేత‌గా దేశానికి సేవలందించార‌ని చెప్పారు. దేశ రాజ‌కీయాల్లో ఆయ‌న‌ది సుదీర్ఘ అనుబంధ‌మ‌న్నారు. 
 
మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌భుత్వంలో ఆయ‌న ప్ర‌ధాన‌‌పాత్ర పోషించార‌న్నారు. కీల‌క‌మైన ఆర్థిక‌, ర‌క్ష‌ణ‌, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌ల మంత్రిగా ప‌నిచేసి త‌న‌దైన ముద్ర‌వేశార‌ని చెప్పారు. ఈమేర‌కు ప్ర‌ధాని ట్వీట్ చేశారు. 
 
జ‌శ్వంత్ సింగ్ మృతిప‌ట్ల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. రాజ‌స్థాన్ రాజ‌కీయాల్లో జ‌శ్వంత్‌సింగ్ కీల‌క‌పాత్ర పోషించారని ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు