తొమ్మిదేళ్ళ క్రితం అత్యాచారానికిగురై కుమిలిపోతున్న ఓ బాధితురాలిపై దుండగులు నాలుగో సారి యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... రాయ్‌బరేలిలోని ఓ గ్రామానికి చెందిన 31 ఏళ్ల వివాహితకి ఇద్దరు పిల్లలు. 2008లో ఆమె తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఇద్దర్ని పోలీసులు అరస్ట్ చేశారు.
ఆ తర్వాత 2011లో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన నుంచి తేరుకోకుండానే 2013లో మరోసారి యాసిడ్ దాడి జరిగింది. అప్పటి నుంచి ఆమె అలిగంజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ యాసిడ్ దాడి బాధితుల కోసం ఏర్పాటు చేసిన కేఫ్‌లో పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చిలో బాధితురాలు రైలులో లక్నోలో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మహిళపై యాసిడ్ దాడి చేశారు. అప్పుడు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమెను హాస్పిటల్‌లో పరామర్శించి పరిహారం కూడా చెల్లించారు. యాసిడ్ దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేశారు.
తన జీవితంలో ఇన్ని దారుణ ఘటనలు చోటుచేసుకున్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన బతుకేదో తాను బతుకుంటే నాలుగోసారి ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో నీళ్లు పట్టుకోవడానికి ఆమె బయటికి వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి యాసిడ్ పోసి పరారయ్యారు. ఈ ఘటనలో కుడి వైపు ముఖం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై లక్నో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.