కాంగ్రెస్ పార్టీని చీల్చే కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ శ్రేణులంతా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వెంటే ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయమాన్ని చవిచూసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలతో పాటు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో అనేకమంది సీనియర్ నేతలు కీలక భేటీ నిర్వహించారు.
అంతేకాకుండా, ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొన్న ఓటమిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకున్నట్టు ఆయన గుర్తుచేశారు. ఓ వైపు చర్యల కత్తి దూస్తున్నప్పటికీ మరోవైపు అసంతృప్త నేతలంతా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే పార్టీని నిలువునా చీల్చే కుట్ర సాగుతున్నట్టుగా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.