ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలుతప్పిన గూడ్సు రైలు

సోమవారం, 5 జూన్ 2023 (14:20 IST)
ఒడిశా రాష్ట్రంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి దేశం ఇంకా తేరుకోలేదు. ఈ ప్రమాదంలో 275 మంది వరకు చనిపోగా, మరో 1100 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో అనేక మంది ఆచూకీ గుర్తుపట్టలేని పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ ప్రమాదంపై దేశం యావత్ తీవ్ర దిగ్భ్రాంతికిలోనైంది. పైగా, ప్రమాదం జరిగిన స్థలంలో సోమవారం ఉదయం నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది. 
 
ఒడిశా రాష్ట్రంలోని బార్ఘడ్ జిల్లాలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. లైమ్‌స్టోన్‌ను మోసుకెళుతున్న రైలు డుంగురి నుంచి బార్ఘాడ్ వెళుతుండగా మెందపల్లి సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో అనేక వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు తగలలేదు. 
 
ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో మార్పే ఘోరకలికి కారణం!! 
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో చేసిన మార్పే ప్రధాన కారణమని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ మార్పునకు కారణమైనవారిని ప్రాథమికంగా గుర్తించామని ఆయన తెలిపారు. అయితే, రైల్వే సేఫ్టీ కమిషనర్, సీబీఐ దర్యాప్తులో ఈ ప్రమాదానికి గల కారణాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని చెప్పారు. 
 
ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కానీ, మృతుల్లో అనేక మందిని ఇప్పటివరకు గుర్తించలేక పోతున్నారు. అనేక మంది జాడ తెలియలేదు. వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రెండు రోజులుగా ప్రమాద స్థలం వద్దే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి వైష్ణవ్.. దెబ్బతిన్న రెండు రైలు మార్గాలను 51 గంటల్లోనే పూర్తి చేసి తొలి గూడ్సు రైలును నడిపేలా చర్యలు తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రాక్‌లను పునరుద్ధరించి తొలి రైలు సర్వీసును నడపడంతోనే తమ బాధ్యత పూర్తికాలేదన్నారు. తప్పిపోయిన వ్యక్తులను ఆందోళన చెందుతున్నావారి కుటంబ సభ్యుల చెంతకు చేర్చడంపై దృష్టిసారిస్తామన్నారు. మా లక్ష్యం తప్పిపోయిన వారిని వారి కుటుంబ సభ్యులు వేగంగా గుర్తించేలా చేయడమే. మా బాధ్యత ఇంకా పూర్తికాలేదు. ఎలక్ట్రానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో ఉద్దేశ్యపూర్వకంగా చేసిన మార్పుతోనే ఘోరం జరిగినట్టు ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు