చైనాతో అమీతుమీకి సిద్ధమైన భారత్ - కాశ్మీర్‌లో కీలక ఆదేశాలు?

సోమవారం, 29 జూన్ 2020 (15:33 IST)
పొద్దస్తమానం చీటికిమాటికి కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాతో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందుకోసం పూర్తిస్థాయిలో బలగాలను లడఖ్ సరిహద్దు ప్రాంతానికి తరలిస్తోంది. ఇదే అంశంపై జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కనీసం రెండు నెలలకు సరిపడినంత వంట గ్యాస్‌ను నిల్వ చేసుకుని పెట్టుకోవాలని చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఎల్జీ, హెచ్పీ గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. 
 
ఈ మేరకు 27వ తేదీన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల విభాగం డైరెక్టర్ పేరిట ఆదేశాలు వెళ్లాయి. వీటిని అత్యవసర ఆదేశాలుగా పరిగణించాలని కూడా అందులో పేర్కొనడంతో, చైనాతో యుద్ధం జరుగనుందన్న ప్రచారం మొదలైంది.
 
అయితే, ప్రజలు యుద్ధం గురించిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వర్షాకాలం రావడంతో, కాశ్మీర్ లోయలో కొండ చరియలు విరిగిపడి, జాతీయ రహదారులను మూసివేయాల్సి వస్తుంది కాబట్టే, గ్యాస్ నిల్వలను పెంచుకోవాలని సూచించామని ప్రభుత్వ వర్గాలు అంటున్నారు. 
 
ఇరు దేశాల మధ్యా నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఏ క్షణమైనా, ఏదైనా జరుగవచ్చని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ముఖ్యంగా చైనా పక్కా ప్లాన్‌తో భారత సైనికులపై దాడికి వచ్చిందని, దాడికి ముందు రోజు సరిహద్దులకు మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్, పర్వతారోహకులను పంపిందని చైనా అధికార మీడియా స్వయంగా వెల్లడించిన తర్వాత యుద్ధ భయాలు మరింతగా పెరిగాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు