కోవిడ్-19 బారినపడి చనిపోయిన వారి అంతిమ సంస్కారాల మార్గదర్శకాలు
శుక్రవారం, 19 జూన్ 2020 (19:03 IST)
కోవిడ్-19 బారినపడి చనిపోయిన వారి మృతదేహాలను వారి సొంత ఊర్లకు, ఇళ్లకు తరలించడానికి స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికీ కరోనా బారినపడి చనిపోయినవారిని వారి స్వగ్రామాలకు తీసుకెళ్లడానికి గ్రామస్తులు అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో కరోనా సోకి మృతిచెందిన వారి దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. భౌతికకాయం తరలింపు సమయంలో ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బంది, కుటుంబ సభ్యులు ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఎలాంటి విధివిధానాలు పాటించాలన్న సూచనలు చేసింది.
- కోవిడ్-19 బారినపడి చనిపోయిన వారి భౌతికకాయాన్ని తరలించే సిబ్బంది సర్జికల్ మాస్క్, పీపీఈ కిట్లు ధరించడం, ఎన్95 మాస్క్‌లు, కళ్లద్దాలు, చేతులకు గ్లోవ్స్ వేసుకోవడంతోపాటు ఇతర జాగ్రత్తలన్నీ పాటించాలి.
- మృతదేహాన్ని ప్యాక్ చేసిన బ్యాగ్, ఇతర సాధనాలు, పరికరాలతోపాటు వాహనాన్నికూడా 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి.
- మృతదేహాన్ని తరలించేప్పుడు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తరచుగా 1% హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి.
- మరణించిన వ్యక్తి ఉన్న గది, మార్చురీ, అంబులెన్స్, శ్మశానవాటికల్లో మృతదేహాలను ఎత్తి, దించే కార్మికులు ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- మృతదేహాలను 4 డిగ్రీల సెల్సియస్ కోల్డ్ ఛాంబర్స్‌లో ఉంచాలి.
- అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా క్రిమిసంహారక ద్రావణాలతో శుభ్రం చేయాలి.
అంత్యక్రియల సందర్భంగా...
- కోవిడ్-19 మృతదేహాల వల్ల అదనపు ముప్పేమీ రాదని కాటికాపరులకు చెప్పాలి. అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు అన్నీ పాటించేలా చూడాలి.
- మృతదేహాన్ని చివరిసారి చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులకు దూరం నుంచి చూడడానికి అనుమతించవచ్చు.
- భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులను అనుమతించకూడదు. కేవలం దగ్గరి బంధువులు, ముఖ్యమైన వారినే అనుమతించాలి.
- భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ ముట్టుకోకుండా వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలన్నీ కొనసాగించవచ్చు.
ఏదైనా స్క్రిప్ట్ చదవడం, పవిత్ర జలం చల్లడం లాంటి మతపరమైన క్రతువులను భౌతికాయం దగ్గర కాకుండా దూరం నుంచి చేసుకోవాలి.
- మృతదేహానికి చివరి సారిగా స్నానం చేయించడం, తాకడం, ముద్దు పెట్టడం, కౌగిలించుకునేందుకు ప్రయత్నించడం లాంటివి చేయకూడదు.
- మృతదేహం దహనం/ఖననం తర్వాత కాటికాపరులు, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
- మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత వచ్చే బూడిద నుంచి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రావు. వారి కుటుంబ ఆచారం ప్రకారం అంతిమ క్రతువు కోసం బూడిదను సేకరించవచ్చు.
- చనిపోయిన వారి సమీప కుటుంబ సభ్యుల నుంచి మిగతావారు సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్తపడాలి.