గుజరాత్‌లోని సూరత్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని తీవ్రవాదిగా పోలుస్తూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతోంది. రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అరవింద్ అక్టోబర్ 16న సూరత్‌లో జరగబోయే ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం యోగి చౌక్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా సూరత్‌లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి. పాకిస్థాన్ హీరోలంటూ బుర్హాన్ వనీ, హఫీజ్ సయీద్, బిన్‌లాడెన్ ఫొటోల మధ్య కేజ్రీవాల్ ఫొటోను పెట్టి బ్యానర్‌లను ఏర్పాటు చేశారు.
సూరత్‌లోని పలు ప్రాంతాల్లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఇటువంటి బ్యానర్లు, పోస్టర్లు అంటించారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ వివాదాస్పద పోస్టర్లు ఏర్పాటు చేయించిందని ఆప్ ఆరోపిస్తోంది. ఇది గమనించిన ఆప్ కార్యకర్తలు వాటన్నింటినీ వెంటనే తొలగించారు. ఈ బ్యానర్లు భాజపానే ఏర్పాటు చేసిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కేజ్రీవాల్ గుజరాత్ రావడం ఇష్టం లేని భాజపా కార్యకర్తలు ఇటువంటి పనులు చేస్తున్నారని సూరత్ ఆప్ ప్రతినిధి యోగేశ్ జద్వాని ఆరోపించారు.