మూగబోయిన గుజరాత్ : 9న తొలిదశ పోలింగ్

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (08:45 IST)
గుజరాత్ రాష్ట్రం మూగబోయింది. తొలి దశ ఎన్నికల పోలింగ్ జరిగే అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగనుంది. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, తొలిదశలో అనేక మంది హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా పశ్చిమ రాజ్‌కోట్‌ స్థానం నుంచి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంద్రనిల్‌ రాజియా గురు ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. 1985 నుంచీ ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. మణినగర్‌కు వెళ్లకుమందు 2002లో ప్రధాని మోడీ ఇదే స్థానం నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన ఇంద్రనీల్‌ తూర్పు రాజ్‌కోట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ కుల సమీకరణాల్లో భాగంగా ఆయన్ని పశ్చిమ రాజ్‌కోట్‌కు మార్చారు. 
 
తొలిదశ పోలింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌కు సంబంధించిన మరో సెక్స్ సీడీ కలకలం సృష్టించింది. ఓ మహిళతో హార్దిక్‌, అతడి స్నేహితులు ఉన్నట్లుగా బుధవారం వెలుగులోకి వచ్చిన క్లిప్పింగ్‌ వైరల్‌ అయ్యింది. అయితే.. ఫేక్‌ వీడియోలను సృష్టిస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కో కన్వీనర్‌ బంభానియా ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు