ఈ ఎన్డీయే కళ్ళు గుడ్డివి... రైతులు ద్రోహం చేస్తోంది : బీజేపీతో అకాళీదళ్ కటీఫ్!

ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (10:03 IST)
భారతీయ జనతా పార్టీకి సుధీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన అకాలీదళ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే వ్యవస్థాపక పార్టీల్లో ఒకటిగా ఉన్న శిరోమణి అకాలీదళ్... బీజేపీతో ఉన్న తన బంధాన్ని తెంచుకుంది. మూడు వ్యవసాయ బిల్లుల ఆర్డినెన్స్‌లను తేవడానికి ముందు నుంచే బీజేపీతో వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ, బిల్లులను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎన్డీయేతో కలిసుండేది లేదని ఆ పార్టీ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ చండీగఢ్‌లో మీడియాకు వెల్లడించారు.
 
'పార్టీ అత్యున్నత కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఏకగ్రీవం. మేము బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నాం. రైతు వ్యతిరేక బిల్లులను ప్రభుత్వం బలవంతంగా రుద్దాలని చూడటమే ఇందుకు కారణం. ఈ బిల్లులు రైతుల పట్ల అశనిపాతాలు. విషపూరితం' అని సుఖ్ బీర్ సింగ్ నిప్పులు చెరిగారు. 
 
దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు నిరసనలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, ఈ బిల్లులను వెనక్కు తీసుకోవాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీయే కూటమిని ప్రారంభించిన వేళ, శివసేన, తెలుగుదేశం, శిరోమణి అకాలీదళ్ పార్టీలు బీజేపీకి మద్దతు పలికిన మూడు పెద్ద పార్టీలన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివసేన, తెలుగుదేశం ఎన్డీయేను వీడగా, తాజాగా, అకాలీదళ్ కూడా బయటకు రావడం గమనార్హం. 
 
మరోవైపు, ఈ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం భారతావనిని ఏలుతున్నది నాడు ఏబీ వాజ్‌పేయి దూరదృష్టితో ప్రారంభించిన ఎన్డీయే కాదని, ఇప్పుడున్నది రైతు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. 
 
హర్ సిమ్రత్ కౌర్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, "మూడు కోట్ల మంది పంజాబీల బాధ, నిరసనలు విఫలమయ్యాయి. ఇప్పుడు భారతావనిని ఏలుతున్నది వాజ్‌పేయి, బాదల్ ప్రారంభించిన ఎన్డీయే కాదు. ఈ కూటమి తన దీర్ఘకాల మిత్రుడి బాధను వినని చెవిటిది అయిపోయింది. ఈ ఎన్డీయే కళ్లు గుడ్డివి. దేశానికి అన్నం పెడుతున్న వారి ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు'' అని మండిపడ్డారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ నుంచి రాజీనామా చేసిన వారం రోజుల తర్వాత హర్ సిమ్రత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యవసాయ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తీసుకుని వచ్చినప్పటి నుంచి తమ వ్యతిరేకతను చెబుతూనే ఉన్న శిరోమణి అకాలీదళ్, ఈ బిల్లులను ఆమోదించిన తరువాత, తమ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న హర్ సిమ్రత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు