హైదరాబాద్‌లోని చందానగర్‌లో పరువుహత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. చందానగర్‌కి చెందిన హేమంత్ అవంతి అనే అమ్మాయిని గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం సదరు యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ అమ్మాయికి గత కొంతకాలంగా ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 10వ తేదీన వారిద్దరూ బయటకి వచ్చి బీహెచ్‌ఈఎల్ సంతోషీమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కానీ హేమంత్ పరువు హత్యకు గురయ్యాడు.
గురువారం యువతి బంధువులు, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్ ఇంటికి వచ్చి వారిని బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లారు. అందులో హేమంత్ భార్య అవంతి తప్పించుకోగా, హేమంత్‌ని తీసుకువెళ్ళారు. ఈ క్రమంలో హేమంత్ తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపడుతున్న క్రమంలో హేమంత్ శవమై కనిపించాడు. అయితే దీనికి అవంతి తండ్రి, వారి బంధువులే కారణం అని హేమంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
దీనిపైన హేమంత్ భార్య అవంతి స్పందిస్తూ.. తమని నమ్మించి మోసం చేశారని, ఇంతటి దారుణానికి పాల్పడిన తన తల్లిదండ్రులతో పాటుగా మరికొందరిని కూడా వదలొద్దని అవంతి చెప్పుకొచ్చింది. తన అత్తమామల భాద్యత తనదే అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో మొత్తం 13 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, రంజీత్ రెడ్డితో పాటుగా మరికొందరి పైన కేసులు నమోదు అయ్యాయి.