రాందేవ్ కరోనిల్ కిట్లకు హర్యానా సర్కారు అనుమతి

మంగళవారం, 25 మే 2021 (15:06 IST)
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ తయారు చేసిన కరోనా కోసం 'కరోనిల్' అనే ఔషధాన్ని తయారు చేశారు. అయితే ఈ మందు విశ్వసనీయతపై పలు అనుమానాలున్నాయి. దీనిపై వివాదం కూడా కొనసాగుతోంది.
 
అయితే, ఈ వివాదంతో సంబంధం లేకుండా కరోనిల్‌ను కోవిడ్ పేషెంట్లకు పంపిణీ చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బారిన పడిన వారికి ఉచితంగా ఈ కరోనిల్ కిట్‌ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని హర్యానా మంత్రి అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
 
హర్యానాలోని కోవిడ్ పేషెంట్లకు ఒక లక్ష పతంజలి కరోనిల్ కిట్లను పంపిణీ చేస్తామని అనిల్ విజ్ వెల్లడించారు. ఈ కిట్లకు అయ్యే ఖర్చును పతంజలి సగం భరిస్తుందని... మిగిలిన సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.
 
మరోవైపు, కరోనిల్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ ఔషధాన్ని అశాస్త్రీయంగా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమ మెడిసిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికెట్ కూడా ఉందని రాందేవ్ వాదించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పతంజలి మెడిసిన్‌కు హర్యానా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు