డేరా చీఫ్ రామ్ రహీమ్ సింగ్ సన్నిహితురాలు.. హనీప్రీత్ సింగ్ నేపాల్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆమె సెప్టెంబర్ 2వ తేదీన కనిపించిందని పోలీసులు చెప్తున్నారు. ఆమెతో పాటు నలుగురు ఉన్నారని ఆమెను సురక్షిత ప్రదేశంలో దాచేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడైంది. హనీ ప్రీత్ సింగ్ పూర్తిగా గెటప్ మార్చుకుని ప్రైవేట్ టాక్సీలో తిరుగుతుందని సమాచారం.
హర్యానా పోలీసు విభాగానికి చెందిన సిట్‌శాఖ రాజస్థాన్‌లో డేరా బాబా సన్నిహితుడైన ప్రదీప్ గోయల్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పరారీలో ఉన్న హనీప్రీత్ సింగ్ కోసం గాలింపులు చేపట్టింది. ప్రదీప్ పోలీస్ రిమాండ్‌లో ఉన్నాడు. ప్రదీప్ హనీప్రీత్ నేపాల్ పారిపోయిందని చెప్పడంతో హర్యానా పోలీసులు కాఠ్మాండూలోని తమ సోర్స్‌తో కనెక్టయ్యారు.
వీరు హనీప్రీత్ ఫొటో ఆధారంగా వివరాలు సేకరించడం ప్రారంభించారు. ఫలితంగా వారికి హనీప్రీత్ ఆచూకీ లభ్యమైంది. సెప్టెంబరు 2న హనీప్రీత్ కనిపించిందని, తరువాత తిరిగి అదృశ్యమైందని తేలింది. మరోవైపు డేరా చీఫ్‌గా జస్మీత్ పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. డేరా సచ్ఛా సౌధా మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్‌పర్సన్ విపాసన అదృశ్యం కావడంతో డేరాబాబా కొడుకు బాధ్యతలు అప్పగించేందుకు గుర్మీత్ ఒప్పుకొన్నారని సమాచారం.