బెంగాల్‌లో హింసకు కేంద్ర బలగాలే కారణం : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (12:58 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మక చర్యలకు కేంద్ర బలగాలే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చి ఐదు నక్షత్ర హోటళ్ళలో బస చేసి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని ఆమె ఆరోపించారు. బీజేపీ నేతలతో సమావేశమైన తర్వాత బలగాలు తిరిగి వెళ్లిపోయాయని చెప్పారు. అందువల్ల రాబోయే పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఓటు వేయొద్దని ఆమె పిలుపునిచ్చారు.
 
ఇదిలావుంటే, గత రాత్రి హుగ్లీ రైల్వే స్టేషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హౌరా - బర్ధమాన రైల్వే లైనులో లోకల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలను మూడు గంటల పాటు నిలిపివేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గంలో రైళ్లను నిలిపివేసినట్టు తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి కౌశిక్ మిరాన్ తెలిపారు. రాత్రి పది గంటల నుంచి సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట వరకు రైలు సేవలను నిలిపివేసినట్టు ఆయన చెప్పారు. ఫలితంగా కొన్ని లోకల్ రైళ్లతో పాటు దూర ప్రాంతాల రైళ్లు ఆలస్యమైనట్టు వెల్లడించారు. 
 
శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా ఆదివారం హుగ్లీ జిల్లాలోని రిష్రాలో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇది హింసాత్మక ఘటనలకు దారితీయకుండా ఈ నెల 2, 3 తేదీల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసి 144 సెక్షన్ విధించినట్టు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు