నా బలమేంతో శశికళకు అసెంబ్లీలో చూపిస్తా: పన్నీర్ సెల్వం

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:42 IST)
మొసలి కన్నీరు కారుస్తూ, ప్రజల దృష్టిని మరల్చేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ యత్నిస్తున్నారని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం ఆరోపించారు. శశికళ వల్ల రిసార్టులోని ఎమ్మెల్యేలు చాలా బాధలు అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జయలలితకు అక్రమాస్తుల కేసుల కేసులో శశికళకు శిక్ష పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన బలమేంటో శశికళకు అసెంబ్లీలో చూపిస్తానని చెప్పారు. ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతి తమిళ పౌరుడు శశికళ ముఖ్యమంత్రి కాకూడదని కోరుకున్నారనీ, కేవలం తమిళ పార్టీలే కాకుండా, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ఇదే కోరుకుంటోందన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమయిన మీడియా... రిసార్టులో ఏం జరిగిందో బయట ప్రపంచానికి చూపించాలని కోరారు.
 
ఇకపోతే... అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీంకోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తమ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని శశికళ ఎంపిక చేశారు. ఆ తర్వాత పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో 10 మంది మంత్రులతో కలసి గవర్నర్‌ను కలిసేందుకు ఆయన బయల్దేరారు.
 
ఈ నేపథ్యంలో, గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఫోన్ చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి, బలాన్ని నిరూపించుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. అయితే, గవర్నర్ మాత్రం ఆయన ఎడప్పాడి పళనిస్వామికి అపాయింట్మెంట్ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి