దేశంలో ఎపుడైన ఉగ్రదాడులు జరగొచ్చు : కేంద్రం హెచ్చరిక

బుధవారం, 2 అక్టోబరు 2019 (11:41 IST)
దేశంలో ఎపుడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందువల్ల అన్ని రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా, దేశంలోని ప్రధాన వాయుసేన కేంద్రాలపై పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని కేంద్ర ఉన్నతస్థాయి వర్గాలు, కేంద్ర గూఢాచార వర్గాలకు అందిన సమాచారం అందింది.
 
దీంతో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని అమృతసర్, పటాన్‌కోట్, శ్రీనగర్ తదితర భారత వాయుసేన కేంద్రాలపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని అందిన ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో భారత సైనికులు అప్రమత్తమయ్యారు. శ్రీనగర్, అవంతిపూర్, జమ్మూ, పటాన్ కోట్, హిందన్ వాయుసేన కేంద్రాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. 
 
ఫలితంగా వాయుసేన కేంద్రాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతోపాటు ముందుజాగ్రత్తగా పాఠశాలలను మూసివేశారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా భద్రతా బలగాలను మోహరించారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన వాయుసేన దాడుల్లో ధ్వంసమైనా వాటిని పునరుద్ధరించారని, ఉగ్రవాదులు సరిహద్దుల్లోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించిన నేపథ్యంలో ఇంటలిజెన్స్ హెచ్చరికలు అందాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు