మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. తన నియోజకవర్గంలోకి అడుగుపెడితే చంపేస్తానని కాంగ్రెస్ ఎంపీని బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు బెదిరింపులకు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి హట్టా జిల్లాలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
కానీ అయితే హట్టా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ఖటిక్ కుమారుడు ప్రిన్స్‌దీప్ లాల్‌చంద్ ఖటిక్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు ఫేస్ బుక్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. జ్యోతిరాదిత్య సింధియా ''ఎవరైతే ఝాన్సీ రాణిని చంపారో వారి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఒక వేళ నువ్వు హట్టాలో అడుగుపెడితే నిన్ను నేను చంపేస్తా'' అంటూ హెచ్చరించాడు.
మరోవైపు సింధియాకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని ఆ రాష్ట్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నాయకుడు రాజా పటేరియా ఆరోపించారు. ఇలాంటి పోస్టులను తీవ్రంగా పరిగణించి తక్షణమే విచారణ చేపట్టాలని, సింధియాకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.