కరోనా రెండో దశ పాపం పూర్తిగా కేంద్రానిదే : ఐఎంఏ ఘాటు లేఖ

ఆదివారం, 9 మే 2021 (08:34 IST)
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వానిదేనని భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) ఆరోపించింది. ముఖ్యంగా, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని మండిపడింది. పైగా, రెండో దశపై ముందుగా వైద్య నిపుణులు పదేపదే హెచ్చరించినా పెడచెవిన పెట్టిందని ఐఎంఏ ఆరోపించింది. 
 
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా తోలుమందం వ్యవహారంతో ముందుకు పోయిందని ఆరోపించింది. లాక్డౌన్‌ తప్పనిసరి అనే సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ధోరణిని తప్పుబట్టింది. కేంద్రం నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పుడు రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
కరోనా రెండో దశ సంక్షోభం నుంచి బయటపడేందుకు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికైనా దేశవ్యాప్త లాక్డౌన్‌ విధించాలని కోరింది. శనివారం ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఘాటుగా లేఖ రాసింది. వైర్‌సను అదుపులోకి తేవాలంటే ప్రణాళికతో కూడిన లాక్డౌన్‌ను విధించాలని సూచించింది. తద్వారా వ్యాప్తిని నిరోధించడంతో పాటు వైద్య సిబ్బందికీ ఊపిరి పీల్చుకునే వీలు కలుగుతుందని పేర్కొంది. 
 
మరోవైపు రాష్ట్రాలు విడివిడిగా అమలు చేస్తున్న 10-15 రోజుల కట్టడి కాకుండా దేశవ్యాప్త లాక్డౌన్‌ అవసరమని పేర్కొంది. రాత్రి కర్ఫ్యూలతో పెద్దగా ఉపయోగం ఉండదని తెలిపింది. అలాగే, 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసువారికి టీకా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అవలంభించిన విధానాన్ని ఐఎంఏ పూర్తిగా తప్పుబట్టింది. సరైన ప్రణాళిక కొరవడటంతో.. టీకాలు అందక దేశంలో చాలాచోట్ల పంపిణీ నిలిచిపోయిందని విమర్శించింది. 
 
పోలియో, మశూచి వంటి వ్యాధుల విషయంలో అందరికీ టీకా విధానాన్ని పాటించగా.. ఇప్పుడెందుకు వేర్వేరు ధరలకు అందజేయాల్సి వస్తోందని ఐఎంఏ నిలదీసింది. ఆక్సిజన్‌ కొరత, వైద్యులు వైరస్‌ బారిన పడటండం వంటి సంఘటనలపై ఆందోళన వ్యక్తంచేసింది. దేశంలో సమృద్ధిగా ఉత్పత్తి ఉన్నప్పటికీ.. పెద్దసంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులు కొరత ఎదుర్కొంటున్నాయంటే.. సరఫరాలో తప్పుడు విధానాలే కారణమని ఆరోపించింది. అలాగే, మరణాల సంఖ్యను కూడా కేంద్రంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు దాస్తున్నాయని ఆరోపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు