లింగ మార్పిడి చేసుకుని పురుషుడిగా మారిన స్నేహితురాలిని ఓ మహిళ పెళ్లి చేసుకుంది. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ సైతం అనుమతి ఇచ్చారు. దీంతో ఫ్యామిలీ కోర్టులో ఈ వివాహం గత శుక్రవారం జరిగింది. ఆ తర్వాత సోమవారం మరోమారు హిందూ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగిన వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఇండోర్‌కు చెందిన 47 యేళ్ల అల్కా సోనీ అనే మహిళ.. కొంతకాలం తర్వాత తాను మహిళను కాదని గ్రహించి పురుషుడిగా జీవించడం మొదలుపెట్టింది. ఇటీవల తన 47వ పుట్టిన రోజు వేడుకలను అల్కా సోనీ జరుపుకుంది. అదేరోజున ధైర్యం చేసి లింగమార్పిడి చేసుకుని స్త్రీ నుంచి పక్కా పురుషిడిగా మారిపోయి, తన పేరును కూడా అస్తిత్వ సోనీగా మార్చుకున్నాడు.
దీనిపై ఆస్తా స్పందిస్తూ, అస్తిత్వ సోనీ పురుషుడుగా మారకముందు నుంచే తనకు పరిచయం ఉందని చెప్పింది. ఆ తర్వాత తమ పరిచయం ప్రత్యేక బంధంగా మారిందని, దీంతో ఇండోర్ కలెక్టర్‌కు తమ పరిస్థితిని వివరించి ప్రత్యేక వివాహానికి అనుమతి కోరగా ఆయన మంజూరు చేశారని తెలిపారు. ఆ తర్వాత తమ ఇద్దరి కుటుంబాల అనుమతితో తామిద్దరం ఒక్కటైనట్టు వివరించింది.