1989లో అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం దుర్మార్గం, అవినీతి చేస్తోందని ఓ మహిళా నాయకురాలు నిండు సభను ప్రశ్నించారు. ఆధారాలన్నీ చూపిస్తా అంటూ గట్టిగా అరిచారు. ఈ క్రమంలో ఆమెపై అధికార పార్టీకి చెందిన కొందరు ఒక్కసారిగా రెచ్చిపోయి ఎదురుదాడికి దిగారు. చివరికి జుట్టు పట్టుకుని కొట్టడానికి కూడా వచ్చారు.
కౌరవులు, పాండవులు నిండిన సభలో తమిళనాడు అసెంబ్లీలో మహిళా నాయకురాలు జయలలిత ద్రౌపదిలా అవమానానికి గురయ్యారు. అదే సమయంలో ఆ మహిళా నాయకురాలు భీకర కెరటంలా ఏడ్చి అదే సభా వేదికపై పడి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేసింది. ఆఖరికి ఆ నిండు సభలో ప్రజల మన్ననలతో అఖండ మెజారిటీతో మళ్లీ ముఖ్యమంత్రిగా నిలిచారు.
ఆమె జీవితమంతా పోరాటమే. ఆమె ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొని తమిళ ప్రజల హృదయాలను గెలుచుకుంది. చివరకు జయలలిత అనే పేరు నుంచి అందరి చేత "అమ్మా" అని పిలుచుకునే స్థాయికి ఎదిగింది. జయలలిత జీవిత ప్రయాణం చాలామంది ప్రస్తుత రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.