భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైంది. తనతో పాటు తీసుకెళ్లిన 31 శాటిలైట్లను నిర్ధిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర పుటల్లోకి ఎక్కింది. భారత్‌కు చెందిన 100 ఉపగ్రహాలను ఇప్పటివరకు నింగిలోకి పంపింది. ఇది దేశ ప్రజలకు కొత్త సంవత్సర బహుమహతిగా ఇస్రో ప్రకటించింది.
నిజానికి గత ఆగస్టులో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో డీలా పడని ఇస్రో... మరింత పట్టుదలతో తాజా ప్రయోగాన్ని విజయవంతం చేయడం గమనార్హం. శుక్రవారం కక్ష్యలోకి పంపిన ఉపగ్రహాల్లో 28 విదేశీ శాటిలైట్లు ఉన్నాయి. వీటిలో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
అంతకుముందు... పీఎస్ఎల్వీ-సీ40 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.29 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. తనతోపాటు 31 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. వీటిలో మూడు భారత ఉపగ్రహాలు కాగా, మిగిలినని విదేశాలకు చెందిన నానో ఉపగ్రహాలు.