జయలలిత త్వరగా కోలుకోవాలి.. జగన్, శరత్ కుమార్‌ల ఆకాంక్ష

సోమవారం, 5 డిశెంబరు 2016 (09:29 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్‌ జయలలిత త్వరగా కోలుకోవాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పురచ్చితలైవి జే జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 
జయలలిత క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ సోమవారం తెల్లవారుజామున తెలిపారు. ఆయన అపోలో ఆసుపత్రిలో అమ్మను చూసి వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జయలలిత క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే 24 గంటల తర్వాత వైద్యులు వెల్లడిస్తామని చెప్పారని తెలిపారు.
 
జయలలితకు చికిత్స అందిస్తున్నామని, మరో 12 గంటలు ఏం చెప్పలేమని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమెకు హార్ట్ అసిస్ట్ పరికరంతో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. అపోలో ఆసుపత్రికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. లక్షల్లో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. జయ త్వరగా కోలుకోవాలంటూ ఆసుపత్రి బయట ప్రార్థనలు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి