జల్లికట్టు.. ఆటోలకు నిప్పంటించిన పోలీసులు.. సీసీ కెమెరాల్లో రికార్డైంది..

మంగళవారం, 24 జనవరి 2017 (09:10 IST)
తమిళనాట జరిగిన జల్లికట్టు ఉద్యమంలో విద్రోహ శక్తులు, పోలీసులు తాండవం ఆడారు. ఆందోళన కారుల పేరిట విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ ముందు నిల్చున్న వాహనాలకు నిప్పంటిస్తే.. పోలీసులే స్వయంగా ఆటోలకు నిప్పంటించారు. ఐస్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టిన ఆందోళనకారులు పోలీసులను సజీవదహనం చేయడానికి ప్రయత్నించినప్పుడు అడ్డుకున్న పోలీసుల్లో ఒక కానిస్టేబుల్‌.. ఆందోళనకారులకు చెందిన రెండు ఆటోలకు నిప్పుపెట్టడం చర్చనీయాంశమైంది. చుట్టుపక్కలున్న సీసీ కెమెరాల్లో ఈ వ్యవహారం రికార్డయింది.
 
జల్లికట్టు నిర్వహణ కోసం తయారు చేసిన ఆర్డినెన్స్ (అత్యవసర చట్టం)కు తమిళనాడు అసెంబ్లీ చట్టబద్ధతనిచ్చింది. సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైన అసెంబ్లీ దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తమిళనాడు చరిత్రలోనే తొలిసారిగా సాయంత్రం పూట ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సీఎం పన్నీర్‌సెల్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. 
 
కానీ అంతకంటే ముందు చెన్నై రణరంగంగా మారిపోయింది. చెన్నై మెరీనా తీరంలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఆందోళనకారుల వద్దకు  పోలీసులు వెళ్ళడం.. వారిని మెరీనా తీరాన్ని ఖాళీ చేయమని చెప్పడం.. అందుకు వారు ససేమిరా అనడంతో పాటు ఉద్యమంలో విద్రోహ శక్తులు కలిసిపోయాయని.. విధ్వంసం సృష్టించే అవకాశం ఉండటంతో మెరీనాను వీడాలని పోలీసులు తెలిపారు. 
 
అయితే ఆందోళనకారులు వెళ్ళమని చెప్పడంతో వారిపై లాఠీఛార్జ్ చేశారు. ఫలితంగా విద్యార్థులు సముద్రంలోకి దూకేస్తామని హెచ్చరించారు. మెరీనా తీరం నుంచి రోడ్లపైకి కొందరు ఆందోళనకారులు వచ్చారు. పోలీసు స్టేషన్లపై విరుచుకుపడ్డారు. ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలను పెట్రోల్ బాంబులు విసిరి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడికి విద్యార్థులు కారణం కాదని.. విద్రోహ శక్తులేనని చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి