దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళకు ఆరాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చుక్కలు చూపిస్తున్నారు. జయమ్మ మృతికి తర్వాత పోయెస్ గార్డెన్‌లో మకాం వేసి చక్రం తిప్పుతున్న శశికళను వేద నిలయం నుంచి గెంటేయడానికి పన్నీర్ సెల్వం రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా జయలలితకు ప్రాణమైన చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయం నుంచి శశికళను తరిమికొట్టాలని పన్నీర్ డిసైడైపోయారు. 2016 డిసెంబర్ 5వ తేది జయలలిత మరణించిన తరువాత వేదనిలయంలో శశికళ, మన్నార్ గుడి మాఫియా సభ్యులు మకాం వేశారు. అక్కడి నుంచే శశికళ కూడా అన్నాడీఎంకేలో చక్రం తిప్పారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. చివరికి సీఎం కావాలని పన్నీర్ సెల్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆయనతో రాజీనామా చేయించారు. అయితే చిన్నమ్మపై పన్నీరు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అంతటితో ఆగకుండా పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయం జయలలిత స్మారక భవనం చేస్తామని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం శనివారం మధ్యాహ్నం వేదనిలయం ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.