జయలలిత మృతిపై విచారణ జరిపితే ఆత్మహత్య చేసుకుంటా : జైలులో శశికళ వార్నింగ్

ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (08:21 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలో ఓ మిస్టరీగా మారిన విషయం తెల్సిందే. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జయలలిత నమ్మినబంటు, విశ్వాసపాత్రుడైన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆయన గట్టిగా పట్టుబట్టి.. పార్టీని సైతం రెండు ముక్కలు చేశారు. ఇపుడు పార్టీ విలీనానికి ఆయన పెట్టిన షరతుల్లో అమ్మ మృతిపై సీబీఐ విచారణకు పట్టుబట్టడం. 
 
దీంతో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆతృత ప్రతి ఒక్కరిలోనూ నెలకొనివుంది. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళ తన కుటుంబ సభ్యులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. 
 
జయలలిత ఆస్పత్రిలో ఉన్న ఫోటోలు లేదా వీడియో బయటకు వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెంగళూరు జైలుకెళ్లే ముందు హెచ్చరించినట్టు సమాచారం. ఈ విషయాన్ని శశికళ సోదరుడు దివాకరన్ కుమారుడు జయానంద్ దివాకరన్ అంటున్నారు. 
 
జయ ఫోటోలు బయటకు వచ్చినా, ఆమె అంతిమ ఘడియల వ్యవహారం బయటకు పొక్కినా, దానిపై విచారణ జరిపినా తాను ఆత్మహత్య చేసుకుంటానని జైలుకెళ్లే ముందు కూడా శశికళ.. కుటుంబసభ్యులను హెచ్చరించి వెళ్లారని జయానంద్‌ ప్రకటించి మరో సరికొత్త సంచలనానికి తెరతీశాడు. అయితే, జయ ఆస్పత్రి చికిత్సకు సంబంధించి బహిర్గతం చేయనున్నట్టు జయానంద్ ప్రకటించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి