జయలలిత మృతి.. ఆర్ముగం కమిషన్‌కు రిపోర్ట్ ఇచ్చిన శశికళ.. అక్క అలా ఒరిగిపోయింది..
శుక్రవారం, 21 అక్టోబరు 2022 (12:41 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత మరణంపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. ఆమె చివరి క్షణాల్లో ఏం జరిగిందనే దానిపై ఇంకా స్పష్టమైన వివరాలు వెలుగులోకి రాలేదు. 75 రోజుల పాటు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందినా.. ఆమె డిసెంబర్ 5, 2016 ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి అమ్మ అని పిలువబడే జయలలిత మరణంపై అనుమానాలు కొనసాగుతూనే వున్నాయి.
ఈ నేపథ్యంలో, జయలలిత మరణం, అందుకు దారితీసిన పరిస్థితులపై నిగ్గు తేల్చేందుకు గతంలో తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ రూపొందించిన నివేదిక ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి చేరింది.
జయలిలత సన్నిహితురాలు శశికళ చెప్పిన విషయాలను కూడా జస్టిస్ అర్ముగస్వామి తన నివేదికలో పొందుపరిచారు. ఈ వివరాలను శశికళ తన స్టేట్ మెంట్లో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.
2016లో అక్క (జయలలిత)కు శరీరంపై దురదతో కూడిన దద్దుర్లు రావడం మొదలయ్యాయని శశికళ ఇచ్చిన రిపోర్ట్‌లో తెలిసింది. శరీరంపై అనేక చోట్ల సోరియాసిస్ వ్యాపించింది. దైనందిన ప్రభుత్వ పాలనా వ్యవహారాలను అక్క అతికష్టంమ్మీద నిర్వర్తించేది. ఆ సమయంలో డాక్టర్లు కొద్దికాలం పాటు స్వల్ప మోతాదులో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. దాంతో చర్మ సంబంధ సమస్యల నుంచి ఆమెకు ఉపశమనం కలిగింది.
2016లో సెప్టెంబరు 21న ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్క తీవ్ర జ్వరం బారినపడ్డారు. ఆ రోడు మరుసటి రోజు ఆస్పత్రిలో చేరాలని సూచించినా అందుకు ఆమె ఒప్పుకోలేదని శశికళ చెప్పారు. అయితే బాత్రూమ్‌లో కాస్త ఇబ్బందికి గురైన జయలలితను ఆమె పిలుపు మేరకు మంచంపై కూర్చోబెట్టానని.. అక్క ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి తన భుజంపై ఒరిగిపోయింది అంటూ శశికళ వివరించారు.
ఇక, రెండున్నర నెలల పాటు ఆసుపత్రిలోనే గడిపిన జయలలిత ఆ సమయంలో భక్తి పాటలు వింటూ, ఆసుపత్రి గదిలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్ర పటాలు చూస్తూ గడిపినట్టు అర్ముగస్వామి కమిషన్ నివేదికలో పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించేంత వరకు జయలలిత భక్తిపాటలు విన్నారని శశికళ తన వాంగ్మూలంలో వెల్లడించారు.
జయలలితకు ఇష్టమైన భక్తిపాటలను ఆమె అనుచరులు ఓ యూఎస్ బీ డ్రైవ్ లో లోడ్ చేసి తనకు అందించారని, ఆ డ్రైవ్ ను తాను జయలలితకు ఇచ్చానని వివరించారు. అంతేకాదు, అక్క కంటికి పచ్చదనంతో ఇంపుగా ఉండేలా ఆసుపత్రి గదిలో ప్లాస్టిక్ మొక్కలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కాగా, తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ తో జయలలిత పుస్తకాల గురించి మాట్లాడేదని, చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ ప్రస్థానానికి సంబంధించిన 'ప్రైవేట్ లైఫ్ ఆఫ్ మావో జెడాంగ్' పుస్తకం చదవాలని ఆ డాక్టర్ కు సూచించిందని శశికళ వెల్లడించారు.
అక్కకు అపోలో ఆసుపత్రి కిచెన్ లో ప్రత్యేకంగా తయారుచేసిన ఇడ్లీ, పొంగల్, వడ వంటి అల్పాహారాలను వైద్యుల పర్యవేక్షణలో అందించేవారని శశికళ తెలిపారు. ఇక జయలలిత చివరి క్షణాలను కూడా శశికళ తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. కానీ చివర్లో ఆమె హార్ట్ అటాక్‌కు గురైందని అది తెలిసి స్పృహ కోల్పోయానని చెప్పుకొచ్చారు.