చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి నర్సులకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బ్యూటీ టిప్స్ చెప్పారు. దీంతో వారు ఉప్పొంగి పోయారు. సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఈ ఆస్పత్రిలో చేరిన జయలలిత... 74 రోజుల పాటు చికిత్స పొందుతూ.. గుండె పోటు రావడంతో సోమవారం అర్థరాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే.
ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలో డ్యూటీ డాక్టర్లతో పాటు తనకు వైద్య సేవలు అందించిన నర్సులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారనే వార్తలు వస్తున్నాయి. జయలలితకు నర్సింగ్ సేవలు అందించిన షీలా అనే నర్సు మాట్లాడుతూ తమను చూడగానే జయలలిత నవ్వేవారని, తమతో మాట్లాడేవారని, చాలా సార్లు తమకు సహకరిస్తూ వచ్చారని తెలిపింది.
పోయెస్ గార్డెన్‌లో కుక్ తనకు ఇష్టమైన వంటకాలు ఎలా చేసేవారో జయలలిత చెప్పినట్లు షీలా చెప్పారు. వాటిలో ఉప్మా, పొంగల్ లేదా కర్డ్ రైస్, పొటాటో కర్రీ ఉండేవట. తాము ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించేవారని, అతి కష్టంగానైనా సరే తినడానికి ప్రయత్నించేవారని ఆమె చెప్పారు.
అస్పత్రి సిబ్బందికి ఎప్పుడూ గుర్తుండి పోయే జ్ఞాపకం కూడా ఉంది. తన ఇంటికి విందుకు రావాలని మెడికల్ టీమ్ అంతటినీ జయలలిత ఆహ్వానించారట. ఆమెకు అపోలోలో కాఫీ నచ్చలేదట. మా ఇంటికి రండి, కొడైనాడుకు చెందిన బెస్ట్ టీని మీకు ఇస్తాను అని చెప్పారని డాక్టర్ రమేష్ వెంకటరామన్ చెప్పినట్లు జాతీయ పత్రిక రాసింది.