ఈఎస్ఐ ఖాతాదారులకు శుభవార్త, ఉద్యోగం కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (13:33 IST)
ఈఎస్ఐ ఖాతాదారులకు ఇది శుభవార్తే. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారందరికి వారి వేతనంలో 50 శాతం సొమ్మును నిరుద్యోగ భృతిగా చెల్లించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ ప్రకటించింది. అటల్ బీమిత్ కల్యాణ్ యోజన కింద ఈ సాయం అందించనున్నట్టు తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు సమీపంలోని ఈఎస్ఐ కార్యాలయంలో స్వయంగా సంప్రదించి కానీ, ఆన్లైన్లో కానీ, పోస్టులో కానీ దరఖాస్తు పంపవచ్చని పేర్కొంది.
 
దరఖాస్తుతో పాటు ఆధార్ కాపీ, బ్యాంకు వివరాలు, అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ఏడాది పాటు అంటే వచ్చే ఏడాది జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. గతంలోను నిరుద్యోగ భృతి లభించేది. అయితే అప్పుడు వేతనంలో 25శాతం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దానిని 50 శాతానికి పెంచారు.
 
అలాగే నిబంధనలు కూడా కొంత సరళతరం చేశారు. గతంలో సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తు పంపించే వెలుసుబాటు ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునేలా నిబంధనలు సడలించారు. దరఖాస్తు పూర్తయిన తర్వాత నిరుద్యోగ భృతి కార్మికుల బ్యాంకు ఖాతాలోనే పడనుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు