తమిళ భాష నుంచే కన్నడం పుట్టిందంటూ తమిళ అగ్రనటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కర్నాటక భాషాభిమానులు, కర్నాటక భాషా సంఘాలు, రాజకీయ నేతలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయన నటించిన థగ్ లైఫ్‌తో పాటు ఆయన సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా నిషేధిస్తామని కర్నాటక రాష్ట్ర సాంస్కృతి శాఖామంత్రి శివరాజ్ తంగడగి హెచ్చరించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కమల్ హాసన్ కన్నడిగుల గురించి అనుచితంగా మాట్లాడారు. ఇది కన్నడిగులు సహించరు. ఆయన క్షమాపణలు చెప్పాలి. లేదంటే కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ రాస్తాను. ఈ రోజే చెబుతున్నాను. ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇందులో మరో మాటకు తావులేదు. లేదంటే ఆయన సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా చూస్తాం అని తంగడగి స్పష్టం చేశారు.
మరోవైపు, కమల్ హాసన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కర్నాటకలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాషకు వేల సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర ఉందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఆగ్రహంతో కొన్ని చోట్ల కమల్ హాసన్ పోస్టర్లను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమల్ హాసన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన నటించిన థగ్ లైఫ్ చిత్ర ప్రదర్శనను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.