పెళ్లి పీటలపై నుంచి పారిపోయిన వరుడు... అతిథిని ఒప్పించి...

బుధవారం, 19 మే 2021 (16:36 IST)
సాధారణంగా పెళ్లి ముహుర్తానికి వధువు కనిపించకపోవడం వంటి దృశ్యాలు చూస్తుంటాం. సినిమాల్లోనూ ఇలాంటి సన్నివేశాలు అధికంగా ఉంటాయి. కానీ, ఇక్కడ వరుడు పెళ్లి ముహూర్తానికి కనిపించకుండా పారిపోయాడు. దీంతో పెళ్లికి వచ్చిన అతిథిని ఒప్పించి వివాహం చేయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలోని మహారాజ్‌పూర్ పట్టణంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మహారాజ్‌పూర్ పట్టణంలో ఇరు కుటుంబాలు కలిసి ఓ పెళ్లిని చేయాలని నిర్ణయించారు. వారి సంప్రదాయం ప్రకారం జైమాల కార్యక్రమం (వధూవరులు దండలు మార్చుకోవడం) ముగిసింది. 
 
ఇక పెళ్లికి సంబంధించి ప్రధాన కార్యక్రమం ప్రారంభంకాబోతోంది. ఇంతలో ఉన్నట్టుండి వరుడు కనిపించకుండా పోయాడు. వధువు, వరుడి కుటుంబ సభ్యులు బంధువులు అతడి కోసం తీవ్రంగా గాలించారు. అయినా లాభం లేకుండా పోయింది. 
 
ఇంతలో అతడు కావాలనే తప్పించుకుని పారిపోయాడని వధువు తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అయితే అందుకు గల కారణాలు మాత్రం తెలిసి రాలేదు.
 
వధువు ఒక్కతే పెళ్లి మండపంలో ఉండిపోవడం ఆమె కుటుంబ సభ్యులను చాలా ఇబ్బందికి గురిచేసింది. దాదాపుగా వధువు పరిస్థితి కూడా అదే. అయితే ఇంతవరకు వచ్చిన పెళ్లి ఆగిపోకుండా పెళ్లికి వచ్చిన అతిథుల్లో ఎవరైనా పెళ్లికి సిద్ధంగా ఉన్నారోనని ఆరా తీశారు. 
 
లక్కీగా ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. వధువు కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి జరిపించారు. వరుడు ఒక్కడు మారాడేమో కానీ, పెళ్లైతే అనుకున్న విధంగానే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ తర్వాత పారిపోయిన వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు