కె.రోశయ్యకు విశ్రాంతి.. తమిళనాడు గవర్నర్‌గా డీహెచ్.శంకరమూర్తి?

శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:45 IST)
తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్యకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విశ్రాంతినివ్వనుంది. గవర్నర్ పదవి నుంచి ఆయనను తప్పించి.. ఆ స్థానంల కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక శాసనమండలి ఛైర్మన్ డి.హెచ్.శంకరమూర్తిని నియమించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
 
ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల అనంతరం బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువైంది. దీంతో శాసనమండలి ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందులోభాగంగానే జేడీఎస్‌తో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. అందులోభాగంగా జేడీఎస్ ఎమ్మెల్సీ బసవరాజ హొరట్టికి శాసమండలి ఛైర్మన్ పదవిని కట్టబెడతామని, తమకు డిప్యూటీ చైర్మన్ పదవి చాలని రాయబారాలు సాగిస్తున్నారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా వివాద రహితుడిగా పేరున్న డి.హెచ్.శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా పంపించాలని కమలనాథులు భావిస్తున్నట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 

వెబ్దునియా పై చదవండి