కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు బంతి ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా కోర్టులో ఉంది. ఆయన కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుంటే న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు.. బీజేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
కాగా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కేవలం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగడితే సరిపోదు. అందుకే, జేడీఎస్‌లో చీలిక తెచ్చేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నట్టు సమాచారం. దీంతో, తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్ జాగ్రత్తపడుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. వీరికి ఇప్పటికే కేరళ పర్యాటక శాఖ కూడా ఆహ్వానం పలికుతూ ట్వీట్ కూడా చేసింది.