ఆ మూడు రాష్ట్రాల్లో ఏం జరిగింది?... బీజేపీ ఫార్ములతో కాంగ్రెస్ పక్కా ప్లాన్

బుధవారం, 16 మే 2018 (08:54 IST)
గతంలో భారతీయ జనతా పార్టీ అడ్డదారులు తొక్కి మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిజానికి గోవా, మణిపూర్‌, మేఘాలయలలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. కానీ, ఈ 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కాంగ్రెస్ ఏర్పాటు చేయలేకపోయింది. దశాబ్దాలుగా అలవాటైన పెద్దన్న పోకడకు పోయి చిన్న పార్టీలను చేరదీయలేకపోయింది. 
 
అదేసమయంలో రాజకీయ వ్యూహాలు రచించడంతో మంచి దిట్టగా ఉన్న బీజేపీ అధినేత అమిత్ షా.. కాంగ్రెస్‌ కన్నా వేగంగా స్పందించారు. తన రాజకీయ చాణుక్యతతో మూడుచోట్ల ఎన్నికల అనంతర పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో గుణపాఠంతో కాంగ్రెస్‌ వాస్తవంలోకి వచ్చింది.
 
ఇపుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతర హంగ్ అసెంబ్లీ ఏర్పాటైంది. దీన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ గతంలో బీజేపీ అనుచరించిన పార్ములానే ఒడిసిపట్టుకుంది. ఫలితంగా పూర్తి ఫలితాలు వెల్లడికాకముందే శరవేగంగా స్పందించింది. మూడో స్థానంలో ఉన్న జేడీ(ఎస్)కు మద్దతు పలికింది. 
 
ప్రస్తుతం గవర్నర్లు అనుసరించే సంప్రదాయం ప్రకారం తన వద్దకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వచ్చిన నేతల్లో ఎవరి దగ్గర నంబర్లు తగినన్ని ఉన్నాయని గవర్నర్‌ భావిస్తారో వారికే అవకాశం ఇస్తారు. అందువల్ల కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) కలిసి ఇచ్చిన లేఖను గవర్నర్‌ కాదనలేరని, అందుకు విరుద్ధంగా వెళితే బీజేపీకే చెడ్డపేరు వస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. గవర్నర్‌ కాదంటే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని పార్టీ చెబుతోంది.
 
గతంలో ఏం జరిగింది? 
2017 మార్చిలో గోవాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. కాంగ్రెస్‌ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార బీజేపీ 12 సీట్లతో చతికిలబడింది. బీజేపీ శత్రువులైన చిన్న పార్టీలకు తానే దిక్కనుకుంది కాంగ్రెస్‌. గవర్నర్‌ను కలిసి వచ్చింది కానీ, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని అడగలేదు. బీజేపీ పావులు కలిపి మనోహర్ పారీకర్‌ను రంగంలోకి దించింది. కాంగ్రెస్‌ తేరుకొనేలోపే గోవాలో బీజేపీ సర్కారు కొలువు తీరింది.
 
అదే నెలలో మణిపూర్‌లోనూ సీన్‌ రిపీటైంది. 60 మంది ఉన్న సభలో 28 మంది కాంగ్రెస్‌ వారే. బీజేపీ నంబర్‌ 21. కాంగ్రెస్‌ ముగ్గురిని కూడగట్టుకొనే లోపే బీజేపీ గవర్నర్‌ను కలిసింది. గవర్నర్‌ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేను వెతికి బీజేపీకి అప్పజెప్పడానికి కేంద్ర నిఘా వర్గాలే రంగంలోకి దిగాయని కథనాలు వచ్చాయి. 
 
ఇకపోతే, గత మార్చిలో మేఘాలయలోనూ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ. 60 మంది ఉన్న సభలో కాంగ్రెస్‌కు 21 వచ్చాయి. బీజేపీకి కేవలం రెండంటే రెండే సీట్లు వచ్చాయి. ఎన్‌పీపీకి 18 సీట్లు ఉన్నాయి. దాని నాయకత్వంలో కూటమి కట్టించి, ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు